Ticker

6/recent/ticker-posts

గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు సిద్ధం, సత్య కుమార్ యాదవ్ .



  •  ఈ ఏడాది చివరి నాటికి గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు సిద్ధం. 
  • 2028 నాటికి సెకండరీ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత నిర్మూలన
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సభ్యుడు నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ ఆసుపత్రుల నిర్మాణాలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చినా, పనులు వేగంగా సాగలేదని పేర్కొన్నారు.

సీతంపేట మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం అదనంగా రూ.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. మిగిలిన రూ.11 కోట్లతో నిర్మాణ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దోర్నాల మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి భవనాన్ని జులై నాటికి పూర్తి చేయాలని, మిగిలిన ఆసుపత్రుల నిర్మాణాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని వెల్లడించారు.

ఓపీ/ఐపీ సేవలు విస్తరణ

సెకండరీ ఆసుపత్రులు (ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రులు)లో వైద్యుల కొరతను 2028 నాటికి పూర్తిగా తీరుస్తామని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వం జీరో వెకెన్సీ విధానం ప్రకారం వైద్యుల నియామకాలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సెకండరీ ఆసుపత్రుల్లో 300 మంది వైద్యులను నేరుగా నియమించిందని, అదనంగా ఇన్‌సర్వీస్ మరియు సీనియర్ రెసిడెంట్ విభాగాల్లో 600 మంది వైద్యులు చేరినట్లు తెలిపారు. 2028 నాటికి సెకండరీ ఆసుపత్రుల్లో ఎటువంటి వైద్యుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

సీతంపేట ఆసుపత్రిలో అనుమతించిన 24 పోస్టుల్లో ప్రస్తుతం 21 మంది వైద్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఓపీ, ఐపీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.

2023-24తో పోలిస్తే 2024-25లో సీతంపేట ఆసుపత్రిలో ఓపీ సేవలు సుమారు ఆరు వేల వరకు పెరిగినట్లు తెలిపారు. డయాలసిస్ అవసరాల దృష్ట్యా ఇటీవల అదనంగా ఐదు పడకలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Post a Comment

0 Comments