Ticker

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్‌లో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకా పంపిణీ.

 

మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల వయస్సు కలిగిన సుమారు 3,45,377 మంది బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) నిరోధక టీకాను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ప్రారంభించనున్నారు.

ప్రథమ విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి 1,90,800 డోసులు రాష్ట్రానికి చేరాయి. మిగిలిన డోసులు దశలవారీగా అందనున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం ఉన్న 1,645 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), పట్టణ ఆరోగ్య కేంద్రాలు (UPHCలు) మరియు నియమిత టీకా కేంద్రాల్లోనే ఈ వ్యాక్సిన్ అందించబడుతుంది.

HPV వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత

HPV వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన మరియు సమర్థవంతమైన రోగనిరోధక టీకాగా గుర్తించబడింది. ఇది ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను 70–90 శాతం వరకు తగ్గించగలదని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా యోని, వల్వా, గుద సంబంధిత కొన్ని క్యాన్సర్లను మరియు గెనిటల్ వర్ట్స్ వంటి సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

లైంగిక జీవితం ప్రారంభం కాకముందు, ముఖ్యంగా 9–14 ఏళ్ల వయస్సులో ఈ టీకా తీసుకుంటే గరిష్ఠ రక్షణ లభిస్తుంది. అయితే HPV టీకా వేసుకున్న తర్వాత కూడా తగిన వయస్సు వచ్చినప్పుడు పెప్ స్మియర్ లేదా HPV స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. టీకా స్క్రీనింగ్ అవసరాన్ని రద్దు చేయదు.

HPV అంటే ఏమిటి?

HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) అనే వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇది మహిళల్లో సాధారణంగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటి. ముఖ్యంగా యువతిలో HPV సంక్రమణ అధికంగా ఉంటుంది.

టీకా ద్వారా పూర్తిగా నివారించగల ఏకైక క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. బాలికలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండేందుకు HPV టీకా అత్యంత అవసరం.

HPV టీకా ఎలా ఇస్తారు?

ఈ టీకాను సాధారణంగా భుజం పైభాగంలోని కండరంలోకి (ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్) ఇస్తారు. ఇది సాధారణ టీకాల్లాగే కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

ఎవరికీ ఈ టీకా? (Target Population)

  • 14 సంవత్సరాలు పూర్తై, ఇంకా 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలు
  • కార్యక్రమం ప్రారంభ తేదీ నుంచి 90 రోజుల్లో 15 సంవత్సరాలు పూర్తి అయ్యే బాలికలు కూడా అర్హులు
  • ఈ వయస్సు గుంపు మొత్తం జనాభాలో సుమారు 1% ఉంటుంది

డోసుల షెడ్యూల్

9–14 ఏళ్ల బాలికలకు సాధారణంగా రెండు డోసులు ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఆరు నెలల విరామంతో రెండో డోసు ఇస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 0, 1, 6 నెలల షెడ్యూల్ కూడా అనుసరించవచ్చు.

15–45 ఏళ్ల మహిళలకు మూడు డోసులు అవసరం అవుతాయి. మొదటి డోసు ఇచ్చిన రోజు నుంచి 1–2 నెలల తర్వాత రెండో డోసు, ఆరు నెలల తర్వాత మూడో డోసు ఇస్తారు.

టీకా వివరాలు

  • టీకా పేరు: గార్డాసిల్–4 (Gardasil-4)
  • రకం: క్వాడ్రివాలెంట్ (HPV రకాలు 6, 11, 16, 18 పై రక్షణ)
  • మోతాదు: 0.5 మి.లీ
  • ఇంజెక్షన్ విధానం: కండరంలో (IM)
  • ఇంజెక్షన్ స్థలం: ఎడమ పైభుజం
  • టీకా పూర్తిగా ఉచితం

ఎక్కడ టీకా వేస్తారు?

కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే:

  • ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ / PHC
  • కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)
  • ఉప జిల్లా / జిల్లా ఆసుపత్రులు
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలు & ఆసుపత్రులు.
నమోదు & సర్టిఫికెట్
U-WIN డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా:
  • స్వయంగా నమోదు చేసుకోవచ్చు
  • • ASHA / ఆరోగ్య సిబ్బంది సహాయంతో నమోదు చేయించుకోవచ్చు
  • • నేరుగా వచ్చి (Walk-in) కూడా టీకా తీసుకోవచ్చు
  • టీకా సర్టిఫికెట్:
  • • U-WIN నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • • అవసరమైతే హార్డ్ కాపీ కూడా అందిస్తారు
టీకా బృందం
• వ్యాక్సినేటర్ (ANM / Nurse / LHV / CHO)
• మొబిలైజర్లు (ASHA / AWW / లింక్ వర్కర్)
• వెరిఫయర్ (ఆరోగ్య సిబ్బంది)
• వాలంటీర్లు (ఫీల్డ్ మానిటర్లు / కమిటీ సభ్యులు)

శాఖల సమన్వయం
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి:
• విద్య శాఖ
• మహిళా & శిశు అభివృద్ధి శాఖ
• గిరిజన, పంచాయతీ రాజ్ శాఖలు
• యువజన వ్యవహారాలు
• మీడియా శాఖలు
• వైద్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు
సమన్వయంతో పని చేస్తాయి.

సాధారణ దుష్ప్రభావాలు

HPV టీకా సాధారణంగా చాలా సురక్షితం. ఎక్కువ మందికి ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే కొంతమందిలో సూది వేసిన ప్రదేశంలో నొప్పి, ఎరుపు, వాపు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, అలసట, వాంతులు లేదా మైకం వంటి స్వల్ప లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా 1–3 రోజుల్లో తగ్గిపోతాయి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు పారాసెటమాల్ వంటి మందులు తీసుకోవచ్చు.

అరుదుగా గమనించాల్సిన పరిస్థితులు

అత్యంత అరుదుగా తీవ్రమైన అలర్జీ (అనాఫైలాక్సిస్) వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా నాలుక ఉబ్బడం, తీవ్రమైన దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత కనీసం 15–30 నిమిషాలు ఆరోగ్య కేంద్రంలోనే ఉండడం మంచిది.

ఎవరికి టీకా ఇవ్వకూడదు?

గర్భిణీ స్త్రీలకు సాధారణంగా ఈ టీకా ఇవ్వరు. గర్భం ముగిసిన తర్వాత మిగిలిన డోసులు పూర్తి చేయవచ్చు. టీకా పదార్థాలపై తీవ్ర అలర్జీ ఉన్నవారు ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన జ్వరం లేదా అస్వస్థత ఉన్న సమయంలో టీకా వాయిదా వేయవచ్చు. మొదటి డోసు తర్వాత తీవ్రమైన ప్రతిచర్య వచ్చినవారికి తదుపరి డోసులు జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే ఇస్తారు.

టీకా తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీకా తీసుకున్న వెంటనే 15–30 నిమిషాలు కేంద్రంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి ఉంటే చల్లని గుడ్డతో స్వల్పంగా కంప్రెస్ చేయవచ్చు. 24 గంటల వరకు మసాజ్ చేయకూడదు. అధిక జ్వరం, తీవ్ర వాపు లేదా శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


సర్వైకల్ క్యాన్సర్ నివారణకు మరిన్ని చర్యలు

HPV టీకాతో పాటు 30 ఏళ్ల తర్వాత నుంచి క్రమం తప్పకుండా సర్వైకల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. సురక్షిత లైంగిక జీవనం, సిగరెట్ వాడకం నివారణ వంటి జాగ్రత్తలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది బాలికలకు భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభించనుంది. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి టీకా తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments