Ticker

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ పాలన దేశానికి ఆదర్శం..

ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థ ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలు, పథకాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు ఆలోచించేలా ఈ రోజు మన పాలన సాగుతోంది. ఇలాంటి అత్యుత్తమ పాలన వ్యవస్థపై కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అసత్యాలు, అవాస్తవపు రాతలతో ప్రజల మెదడును కలుషితం చేస్తున్నాయి. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అంటూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితులలో మీకు వాస్తవాలు తెలియజేయడం కోసం క్రింద కొన్ని విషయాలు ప్రస్తావించాము. 

 *ప్రగతి పథంలో పల్లె సీమలు* 

ఈరోజు మీరు ఏ గ్రామానికి వెళ్లిన అక్కడ ఒక సచివాలయం ఉంది, ఒక విలేజ్ క్లినిక్ ఉంది, ఒక రైతు భరోసా కేంద్రం ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పల్లెలో మన కళ్ళకు స్పష్టంగా కనబడుతున్న ఇది అభివృద్ధి కాదా? పల్లె సీమల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి? కాదా ఆలోచించండి. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కోసం సామాన్య ప్రజానీకం
 వెళ్లాలంటే కొంత భయం, బెరుకు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి మారింది. మీకు ఏం కావాలన్నా మీ ఊరి సచివాలయానికి వెళ్లి అడిగితే వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వస్తున్నాయి. రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, భూమి పత్రాలు, విత్తనాలు, ఎరువులు, మందులు, రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు ఇలా.... ప్రతిదీ మీ ఇంటికి వచ్చి అందిస్తున్నాము. చివరికి డాక్టర్లు నర్సులు కూడా మీ ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు ఒక్కమాటలో చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడింది. ప్రభుత్వ సేవలలో వచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పు అభివృద్ధి సూచిక కాదా ఆలోచించండి. 

 *విద్యారంగంలో కేరళను దాటి ముందుకు.....* 

ఇన్ని రోజులు విద్యారంగంలో కేరళను ఆదర్శంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు కేరళను దాటి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది. నాడు - నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మార్చారు. ఇంగ్లీష్ ప్రాధాన్యతను గుర్తించి అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అత్యాధునిక బోధనా పద్ధతులను మారుమూల స్కూళ్లల్లో కూడా అవలంబిస్తున్నారు. బడా కార్పొరేట్ స్కూల్లలో అత్యధిక ధనవంతులు మాత్రమే చదివే అంతర్జాతీయ సిలబస్ (IB) ను ఈరోజు ప్రభుత్వం మారుమూల పల్లెలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కూడా అందించడానికి కృషి చేస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడి ద్వారా ప్రోత్సాహకమందిస్తున్నారు. అలాగే పిల్లలకు స్కూళ్లలో బలవర్ధకమైన పోషకాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ విద్యా రంగం మీద 70 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. విద్యా రంగలో వచ్చిన ఈ మార్పు అభివృద్ధిలో భాగం కాదా? ఆలోచించండి

 *వైద్య సేవలలో ప్రపంచానికే ఆదర్శం* 

ఒక ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటుందా? అని ఆశ్చర్యపోయేలా మన ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు మన రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గతంలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిథిలావస్థలో ఉండి ఎప్పుడు ఏది ఊడి పడుతుందో అని భయంతో రోగులే కాదు డాక్టర్లు కూడా అటు వైపు వెళ్లడానికి సాహసించేవారు కాదు. కానీ ఈరోజు నాడు - నేడు ద్వారా వాటిని ప్రభుత్వం అత్యాధునికంగా తీర్చిదిద్దింది. ప్రతి PHCలో ఒకరికి బదులుగా ఇద్దరు డాక్టర్లను నియమించింది. జీరో వేకెన్సీ విధానం తీసుకొచ్చి ఈ నాలుగేళ్లలో కేవలం వైద్యానికి శాఖలోని 53000 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ప్రతి గ్రామంలో ఒక వైయస్సార్ విలేజ్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు 10577 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. అందులో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నియమించి ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు గ్రామస్థాయిలోనే అందిస్తుంది. ఈరోజు మన పల్లెల్లో మన ఇంటి దగ్గరికి వైద్య సిబ్బంది వచ్చి 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. 105 రకాల మందులు ఇస్తున్నారు. వృద్ధాప్యం వల్ల తిరగలేని వృద్ధులకు నెలనెలా ఇంటికి వచ్చి బీపీ షుగర్ వంటి పరీక్షలు చేసి కావాల్సిన మందులు ఇస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకునే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? మీరే ఆలోచించండి?

ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలు గతంలో సుమారు 1059 ఉండగా ఇప్పుడు వాటిని మూడు రెట్లకు పెంచి మొత్తం 3255 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది ప్రభుత్వం. అలాగే ఆరోగ్యశ్రీ కింద అయ్యే ఖర్చు పరిమితి గతంలో ఐదు లక్షల రూపాయలు ఉండగా, దానిని 25 లక్షల రూపాయలకు పెంచింది. బడుగు బలహీన వర్గాలు ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వారు అధైర్య పడకుండా వారికి రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ కృషిని అభినందించాలా? వద్దా? మీరే ఆలోచించండి.

 *ఏటా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు....* 

విభజిత 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లో
2014 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 5.4 లక్షలు. 2014 తర్వాత రిటైర్మెంట్లు అధికంగా ఉండటం నియామకాలు తక్కువగా ఉండటం వల్ల 2019 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 4.6 లక్షల తగ్గింది. అంటే 2014-19 మధ్య సుమారు 80 వేల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో తగ్గాయి. 2019 తర్వాత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో సుమారు 1.30 లక్షల ఉద్యోగులు, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేల ఉద్యోగులు మరికొన్ని శాఖలలో ఫుల్ టైం ఉద్యోగాలతో పాటు వాలంటీర్ల రూపంలో 2.66 లక్షల తాత్కాలిక ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. మొత్తం కలిపి ప్రభుత్వ రంగంలో సుమారు 4.7 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 

కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ సంస్థ లెక్కల ప్రకారం 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ లో పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగులు సంఖ్య 44.85 లక్షలు కాగా 2023 మార్చి నాటికి ఈ సంఖ్య 60.73 లక్షలకు పెరిగింది. అంటే 2019-23 మధ్య నాలుగేళ్ల కాలంలో 15.88 లక్షలు ఉద్యోగులు పెరిగారు. దీని ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో కలిపి 2019-23 మధ్య నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చాయి అంటే సంవత్సరానికి 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మన కళ్ల ముందు కనపడుతున్న ఈ లెక్కలు వాస్తవం కాదా మీరే ఆలోచించండి. 

 *మౌలిక సౌకర్యాల కల్పన* 

రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సముద్రతీరాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు కడుతోంది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్స్ కడుతోంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. 60 సంవత్సరాలలో రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాలలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అందులో ఐదు పూర్తయ్యాయి కూడా. ఏళ్ల తరబడి దీనావస్థ అనుభవించిన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది ప్రభుత్వం. 

 *ఆర్థికాభివృద్ధి - అప్పులు* 

2019 నుండి వరుసగా నాలుగు సంవత్సరాలు సకాలంలో వర్షాలు కురవడం, పంటలు బాగా పండడంతో వ్యవసాయ రంగం గణనీయ వృద్ధి సాధించింది. 2018-19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 149.56 లక్షల టన్నులు కాగా 2023 నాటికి 169.30 లక్షల టన్నులకు పెరిగింది. కరోనా వంటి కష్ట సమయంలో కూడా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం అందించి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడడం వల్ల పారిశ్రామిక, సేవా రంగాలు మంచి పురోగతి సాధించాయి. 2018-19 లో రాష్ట్ర GSDP 8.73 లక్షల కోట్ల రూపాయలు కాగా 2022 - 23 నాటికి రాష్ట్ర GSDP 13.17 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నాలుగేళ్ల GSDP 51 శాతం వృద్ధి చెందింది. 2018 - 19 లో రాష్ట్ర తలసరి ఆదాయం 154031 రూపాయలు కాగా అది 2022- 23 నాటికి లక్షలు 219518 రూపాయలకు పెరిగింది. రాష్ట్ర అప్పు 2018-19 సంవత్సరంలో 2.64 లక్షల కోట్ల రూపాయలు కాగా
 అది 2022-23 నాటికి 4.42 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. మన రాష్ట్ర ఎగుమతుల విలువ 2018-19 సంవత్సరంలో 98983 కోట్ల రూపాయలు కాగా 2022-23 నాటికి 159368 కోట్ల రూపాయలకు పెరిగింది. నాలుగు సంవత్సరాలలో ఎగుమతులు 61 శాతం పెరిగాయి. 

ఇలా అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాదిస్తుంటే, మనల్ని మనం మోసం చేసుకునేలా మన కళ్ళ ముందు కనపడుతుంది వాస్తవాలు అబద్ధాలుగా తాము చెప్పే అబద్ధాలు నిజాలుగా మనల్ని నమ్మించడానికి కొన్ని పత్రికలు చాలా దిగజారి వార్తలు రాస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అధికారిక లెక్కలు మాత్రమే చెప్తున్నాము. మీరు విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 

కృతజ్ఞతలతో....... 

సదా మీ సేవలో..... 
 *ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.*

Post a Comment

0 Comments